(నమస్తే న్యూస్,మహబూబాబాద్, అక్టోబర్ 02) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్‌లో ధరణి హాస్పిటల్ సమీపంలో రహదారిపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు ముప్పుగా మారాయి. భారీ వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు మరింత లోతుగా మారి, ప్రతిరోజూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఈ నేపథ్యంపై స్థానికులు మాట్లాడుతూ, “ప్రమాదకరంగా మారిన ఈ గుంతల వల్ల చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేద” ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డుపై ఏర్పడిన ఈ గుంతల కారణంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
రాత్రి వేళల్లో ఈ గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు మరింత పెరిగే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా అధికారులు తక్షణం చొరవ తీసుకొని ప్రమాదకర గుంతలను పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.