•ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి
రిపోర్టర్ : నరేందర్ పడిదం
(నమస్తే న్యూస్,అక్టోబర్ 10, కొత్తగూడ)
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య–స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత–శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియల నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లగా, ఈ ఇద్దరు చిన్నారులు ఇంటి వద్దనే ఉన్నారు.ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్ద బహిర్భూమికి వెళ్లిన వీరు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయారు. కొంతసేపటికి బావి వద్ద చెప్పులు, బట్టలు కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమై శోధన ప్రారంభించారు.సమాచారం అందుకున్న కొత్తగూడ ఎస్సై రాజ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా గ్రామస్తులతో కలిసి శోధనలో పాల్గొన్నారు. తొలుత ఇటికాల రితిక్ మృతదేహం, అనంతరం జతిన్ మృతదేహం బయటకు తీశారు.ఈ ఘటనతో ఎంచగూడెం గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

