(నమస్తే మానుకోట-ములుగు)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల అభివృద్ధికి,రక్షణకు వారి భవితవ్యానికి ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా , వారి రక్షణకు, భద్రతకు ఎన్ని చట్టాలు తెచ్చినా , ఆడపిల్లల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది .అప్పుడే పుట్టిన పసి గుడ్డును చెత్త కుప్పలు ముళ్ల పొదల్లోకి విసిరేస్తున్నారు.బాల్యదశలో కామాందుల దాష్టికానికి బలవుతున్నారు.యవ్వనంలో లైంగిక వేధింపులకు చిద్రమవుతున్నారు, సంసార జీవితంలో నిత్యం సమిధలుగా మారుతూనే ఉన్నారు. మానవ సృష్టికి మూలాధారమైన స్ర్తీ, అదే స్త్రీ-పొత్తిళ్ళలో నలిపివేయబడుతున్న ఘటనలు ,సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో అలాంటి అమానవనీయ ఘటనే చోటు చోసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన చిట్టితల్లిని ఏ తండ్రి తప్పిదమో,ఏతల్లి కర్కషత్వమో నిర్థయగా వదిలేశారు.ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు మండలం పాత్రపురం గ్రామంలో చోటు చేసుకుంది.స్థానికుల కథనం మేరకు.. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు.అటుగా వెళ్తున్న స్థానికులు పొదల్లో ఆడ శిశువు ఏడుపు విని అధికారులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు చిన్నారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులే శిశువును వదిలించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
