


తిరుపతి, జూలై 15 (నమస్తే న్యూస్): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విద్య, ఆరోగ్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన “ప్రతిభా పురస్కారం–2026” కార్యక్రమంలో టీటీడీ విద్యాసంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 147 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించారు.చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలో విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని 33 విద్యాసంస్థల్లో సుమారు 20 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ, విలువలు, కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, “విద్యే జీవితాన్ని మార్చే శాశ్వత సంపద” అని పేర్కొన్నారు. గ్రామీణ, రైతు కుటుంబాల విద్యార్థులు టీటీడీ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా టీటీడీ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, టీటీడీ 150 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా “ప్రతిభా పురస్కారాలు” అందజేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. రూ.162 కోట్లతో విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాస్రూములు, కంప్యూటర్ ల్యాబ్లు, సీసీటీవీ వ్యవస్థలు, ఇతర ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 76 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు, తిరుపతి, తిరుమలలోని వివిధ టీటీడీ పాఠశాలలకు చెందిన 71 మంది విద్యార్థులు కలిపి మొత్తం 147 మందికి ఐదు గ్రాముల వెండి డాలర్, మెమెంటో, శాలువా, ప్రశంసాపత్రం అందజేశారు.ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలకు చెందిన కుమారి ప్రణవి, కుమారి ఉత్పల, కుమారి నేహశ్రీ రాష్ట్రస్థాయిలో 99 శాతం మార్కులు సాధించినందుకు చైర్మన్, ఈవో ప్రత్యేకంగా అభినందించారు.కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జీ. భాను ప్రకాష్ రెడ్డి, ఎన్. సదాశివరావు, జానకి, సీపీఆర్వో డా. టి. రవి, డీఈఓ డి. ఫణికుమార్ నాయుడు, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు, వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
