విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు-ఐసీడీఎస్ పీవో ఎం.ఎల్లమ్మ.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 20(నమస్తే న్యూస్ ).
అంగన్వాడీ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మరిపెడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని ఎం.ఎల్లమ్మ హెచ్చరించారు.గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో అంగన్వాడీ సిబ్బందికి ప్రాజెక్టు స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోషకాహారం,ప్రీ స్కూల్ విద్య,పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ,గర్భిణీలు,బాలింతలకు పోషకాహార సేవలు,ఆరోగ్య పోషణ,బాలల హక్కులు,బాల్య వివాహాల నిరోధం,బాలల హింస నివారణ,ప్రమాదంలో ఉన్న పిల్లలకు రక్షణ,పునరావాసం,సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందించే కౌన్సెలింగ్,న్యాయ,వైద్య,రక్షణ సేవల వంటి అంశాలపై అంగన్వాడీ టీచర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారిని ఎల్లమ్మ మాట్లాడుతూ..అంగన్వాడీ సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా కేంద్రాల్లోనే విధులు నిర్వహించాలన్నారు.సమయపాలన పాటించని సిబ్బందిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ప్రీ స్కూల్ పిల్లల హాజరు శాతాన్ని పెంచాలన్నారు.గర్భిణీలు,బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం చేసేలా చూడాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు పునాది లాంటివని,టీచర్లు, హెల్పర్లు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల రక్షణ భవన్ కోఆర్డినేటర్ చైతన్య, డీసీపీవో, పీఓ వీరన్న,వెంకటేష్, సఖి కోఆర్డినేటర్ శ్రావణి, హబ్ కోఆర్డినేటర్ మహేశ్వరి, ఏసీడీపీఓ తేజ కళ్యాణి, సూపర్వైజర్లు రాజ్యలక్ష్మి, ఉషారాణి, శ్రీదేవి, శ్రీలత, కవిత, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

