
డోర్నకల్/మరిపెడ,ఆగష్టు 13 (నమస్తే న్యూస్).
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని మరిపెడ వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి సూచించారు.బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో గురువారం మరిపెడ మండలంలోని గాలివారిగూడెం,ఎల్లంపేట గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు.ఈ శిబిరాలకు డాక్టర్ గుగులోతు రవితో పాటు గాలివారిగూడెం సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి,ఎల్లంపేట సర్పంచ్ గండి రాధమ్మ, ఎంఎల్హెచ్పీలు సతీష్,అమిత హాజరయ్యారు.వైద్యులు సుమారు 280 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్,వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఇంటి లోపల,బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పగటిపూట కుట్టే దోమల ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందని,ఈ దోమలు స్వచ్ఛమైన నీటి నిల్వల్లో వృద్ధి చెందుతాయని వివరించారు.ఇంటి పరిసరాల్లోని కుండీలు,కూలర్లు,ఉపయోగం లేని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. దోమల నియంత్రణతోనే వ్యాధులను అరికట్టవచ్చని, పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.ప్రస్తుతం ఆహారపు అలవాట్లు,వాతావరణ మార్పులు,కాలుష్యం కారణంగా అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.బిజీ జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే బీపీ,షుగర్ వంటి వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.నిత్యం వ్యాయామం చేయడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని,ఆరోగ్య నియమాలను పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీదేవి,కార్యదర్శులు మంజుల,స్వప్న,ఏఎన్ఎంలు హుస్సేన్ బి,విజయ,బాల వికాస సంస్థ సెంటర్ మేనేజర్ గంధసిరి ఉపేంద్ర,జుజ్జూరి ఉపేంద్ర,గుగులోత్ కవిత, ఆశా వర్కర్లు జ్యోతి, మాధవి, గణిత, పార్వతి, రమాదేవి, నీల, కారోబార్ హుస్సేన్, గ్రామ పెద్దలు,గ్రూప్ లీడర్లు, మహిళలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
