పిల్లలమర్రి సమీపంలో అదుపుతప్పి వంతెన డివైడర్ను ఢీకొన్న కారు

సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్):
సూర్యాపేట జిల్లాలో హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలమర్రి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమవడంతో అందులోని వ్యక్తి మృతదేహం తీవ్రంగా కాలిపోయింది.మృతుడిని ఖమ్మంలోని మమత ఆస్పత్రికి చెందిన న్యూరో సర్జన్ కాసకుర్తి జగదీష్గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనతో ఖమ్మం వైద్య వర్గాల్లో విషాదం నెలకొంది.


