- గంజాయి మత్తులో జీవితలు నాశనం చేసుకోకండి.
- గంజాయి సమాచారం అందించండి,5000/- వరకు నగదు బహుమతి పొందండి.
- మహబూబాబాద్ సిగ్నల్ కాలనీలో గంజాయి నివారణపై అవగాహన కార్యక్రమం.
- ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్.
మహబూబాబాద్,జూన్ 10(నమస్తే న్యూస్)
గంజాయి రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ , టౌన్ సీఐ రఘుపతి రెడ్డి మరియు పోలీస్ సిబ్బందితో కలిసి మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో పర్యటించారు.ప్రజలకు, ముఖ్యంగా యువతకు గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి అక్కడి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన పోస్టర్లను స్వయంగా ఎస్పీ విడుదల చేసి, కాలనీలోని గోడలకు అతికించడం జరిగింది. గంజాయి వాడకం వల్ల మెదడు దెబ్బతినడం, ఆలోచనా శక్తి తగ్గడం, శ్వాసకోశ సమస్యలు, డిప్రెషన్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని మరియు ఇది చదువు, ఉద్యోగం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ వివరించారు.గంజాయిని గుర్తించే విధానం, అంటే ఎండిన ఆకులు, పువ్వులు లేదా మొక్క భాగాల రూపంలో ఉండి, 5-7 దంతాల అంచులను కలిగి, ప్రత్యేకమైన ఘాటైన వాసనతో ఉంటుందని పోస్టర్ల ద్వారా ప్రజలకు తెలియజేశారు. గంజాయికి సంబంధించిన ఎటువంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా, వెంటనే 8712656999 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని, సరైన సమాచారం అందించిన వారికి 5,000 రూపాయల వరకు బహుమతి అందజేయబడుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా గంజాయి లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని, దీనికి ప్రజలందరూ బాధ్యతతో సహకరించాలని ఎస్పీ కోరారు.

