- విద్యార్థుల సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటాం.
- కేజీబీవీలో సమస్యల పరిష్కారానికి సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ హామీ.
నర్సింహులపేట, జూన్ 25 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల గ్రామపంచాయతీ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపడతామని గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ హామీ ఇచ్చారు.గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న సర్పంచ్‌ను కలిసి పాఠశాలలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విద్యార్థినులు తాగునీటి కోసం ఉపయోగిస్తున్న మంచినీటి పైప్‌లైన్ దెబ్బతినడంతో మరమ్మత్తులు అత్యవసరమని ఆమె వివరించారు. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వసతి గృహం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి విద్యార్థినులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని కోరారు.వినతిపై స్పందించిన సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి గ్రామపంచాయతీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పాఠశాల యాజమాన్యం సూచించిన సమస్యలను పరిశీలించి, మంచినీటి పైప్‌లైన్ మరమ్మత్తులతో పాటు వసతి గృహం పరిసరాల్లో పారిశుద్ధ్య, శానిటైజేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రతినిధులు రాంబాబు, యాకూబ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

