Type Here to Get Search Results !

మండల అభివృద్ధి, వరదల నివారణ చర్యలపై సమీక్ష.

  • అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
  • ప్రత్యేక అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి.



డోర్నకల్/మరిపెడ, జూన్ 20 (నమస్తే న్యూస్): వర్షాకాల నేపథ్యంలో వరదల నివారణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, బడిబాట కార్యక్రమం, గృహ నిర్మాణాలు తదితర అంశాలపై మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పలు శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మండలంలోని లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచడంతో పాటు నిత్యావసర వస్తువుల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాలువల పూడికతీత పనులను వేగవంతంగా పూర్తి చేసి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో వ్యాధి నిరోధక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదు లక్ష్యంగా "బడిబాట" కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. బడి మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన సౌకర్యాలు సకాలంలో అందేలా చూడాలని ఎంఈఓకు సూచించారు.

ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ మెటీరియల్ బిల్లులను త్వరితగతిన క్లియర్ చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులకు సూచించారు.పశుసంవర్ధక శాఖ అధికారులు వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకాలు వేయాలని, రైతులకు అవసరమైన సూచనలు అందించాలని పేర్కొన్నారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని ప్రత్యేక అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంఈఓ అనితాదేవి, వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి, వ్యవసాయ అధికారి బోడ వీరాసింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, హౌసింగ్ శాఖల ఇంజినీర్లు, వెటర్నరీ అధికారులు తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.