- రూ.4 లక్షల ఆస్తి నష్టం..
- బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం కోరిన గ్రామస్థులు.
తొర్రూరు, జూన్ 20 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామంలో శనివారం వీచిన ఈదురుగాలులు, వర్షానికి తీవ్ర నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన పులి లావణ్యకు చెందిన కోళ్ల షెడ్ గాలివాన ధాటికి పూర్తిగా ధ్వంసమైంది.స్థానికుల కథనం ప్రకారం, ఒక్కసారిగా బలమైన గాలులు వీచడంతో షెడ్ పైకప్పు రేకులు ఎగిరిపోయి సుమారు 100 మీటర్ల దూరంలో పడిపోయాయి. గాలివాన తీవ్రతకు షెడ్ పూర్తిగా నేలమట్టమైపోయింది. ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.ఈ ఘటనలో సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు పులి లావణ్య తెలిపారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి తగిన ఆర్థిక సాయం అందించాలని బాధితురాలు, గ్రామస్థులు కోరుతున్నారు.ఇటీవల వర్షాకాలంలో తరచూ కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులతో గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి నష్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.



