Type Here to Get Search Results !

మరిపెడలో అభివృద్ధి, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి

9వ వార్డులో పారిశుధ్య పనుల పరిశీలన.. 12వ వార్డులో సైడ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం


డోర్నకల్/మరిపెడ, జూన్ 20 (నమస్తే న్యూస్): మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆమె పారిశుధ్య పనులను పరిశీలించడంతో పాటు నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.పట్టణంలోని 9వ వార్డులో చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను చైర్‌పర్సన్ స్వయంగా పరిశీలించారు. చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రత, దోమల నివారణ చర్యలపై పారిశుధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం 12వ వార్డు పరిధిలో గుండెపూడి క్రాస్ రోడ్డు నుంచి కమాన్ సెంటర్ వరకు నిర్మించనున్న సైడ్ డ్రైనేజీ పనులను చైర్‌పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ ప్రత్యేక చొరవ, సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించిన ఆమె, పట్టణ అభివృద్ధికి అవసరమైన మరిన్ని మౌలిక వసతుల పనులను దశలవారీగా చేపడతామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య మెరుగుదల, మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, కౌన్సిలర్లు గంట్ల గౌతమ్ రెడ్డి, మెరుగు రాము, జాటోతు సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, మైనార్టీ సెల్ కార్యదర్శి మహ్మద్ అప్సర్, నాయకులు గంధసిరి రవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.