Type Here to Get Search Results !

యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్‌ను అభినందించిన మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.


  • యశ్వంత్ నాయక్‌ను అభినందించిన మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ




డోర్నకల్/మరిపెడ, జూన్ 20 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యా తండాకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్ ఇటీవల ముంబై రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసిన పర్వతారోహణ యాత్ర విశేషాలను గవర్నర్‌తో పంచుకున్నారు.హిమాలయ పర్వతాల్లో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించిన విధానం, శిఖరాన్ని చేరుకున్న సమయంలో కలిగిన అనుభూతులను యశ్వంత్ నాయక్ వివరించారు. తన యాత్రలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించే ఛాయాచిత్రాలను గవర్నర్‌కు చూపిస్తూ వాటి వెనుక ఉన్న అనుభవాలను వివరించారు.ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో తనకున్న అనుబంధాన్ని యశ్వంత్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో తొలిసారిగా గవర్నర్‌ను కలిసినప్పుడు ఆయన అందించిన ప్రోత్సాహం, సూచనలు తన జీవితంలో కీలక మలుపు తిప్పాయని తెలిపారు. మారుమూల గిరిజన తండా నుంచి వచ్చిన తనలాంటి యువకుడిని ప్రోత్సహించి, సాహసయాత్రల వైపు అడుగులు వేయడానికి ధైర్యం ఇచ్చిన గవర్నర్ మార్గదర్శకత్వం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు.యశ్వంత్ నాయక్ సాధించిన విజయాలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభినందించారు. ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అవసరమైన కఠోర శిక్షణ, మానసిక ధైర్యం, అంకితభావాన్ని ప్రశంసించారు.

యువతకు యశ్వంత్ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా యశ్వంత్ నాయక్ తన భవిష్యత్ లక్ష్యాలను గవర్నర్‌కు వివరించారు. దేశంలోని ప్రధాన పర్వత శిఖరాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే సంకల్పంతో "హర్ శిఖర్ పర్ తిరంగా" కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా యువతలో దేశభక్తి, సాహస స్ఫూర్తిని పెంపొందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.యశ్వంత్ ఆశయాన్ని అభినందించిన గవర్నర్, భవిష్యత్‌లో చేపట్టే ప్రతి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.దేశానికి మరింత గౌరవం తీసుకొచ్చేలా కొత్త శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

తనకు విలువైన సమయాన్ని కేటాయించి ఆత్మీయంగా ప్రోత్సహించిన గవర్నర్‌కు యశ్వంత్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.గవర్నర్ అందించిన ప్రోత్సాహం తన బాధ్యతను మరింత పెంచిందని, దేశం గర్వించేలా మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు.మహబూబాబాద్ జిల్లా మారుమూల గిరిజన తండా నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ తెలంగాణ కీర్తిని దేశవ్యాప్తంగా చాటుతున్న భూక్యా యశ్వంత్ నాయక్‌కు పలువురు ప్రజాప్రతినిధులు,ప్రముఖులు,స్థానికులు,అభినందనలు తెలియజేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.