Type Here to Get Search Results !

ప్రజాసేవకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యక్తిగత దూషణలు తగదు:స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ

  •  ప్రజాసేవకుడిపై వ్యక్తిగత దూషణలు తగదు

  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండనీయం.
  • వ్యక్తిత్వ హననం మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి.
  • స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ.



సూర్యాపేట,జూన్19(నమస్తే న్యూస్ డెస్క్):బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, బాడీ షేమింగ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని  స్వేరోస్ నెట్‌వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉన్న నాయకులు హుందాతనంతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రవీణ్ కుమార్ తన సేవా కాలంలో వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గురుకుల విద్యా వ్యవస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరణగా నిలిచారని అన్నారు.ఇలాంటి వ్యక్తిపై రాజకీయ కారణాలతో వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం తగదని విమర్శించారు. డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వరంగల్ పట్టణంలో ఆయన అభిమానులు, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని పేర్కొన్నారు.డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువరని, ఆయనపై వ్యక్తిగత దాడులు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని శివకృష్ణ డిమాండ్ చేశారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ పరస్పర గౌరవం పాటించడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలిచే విధంగా వ్యవహరించాలని, అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.