సతులకు బదులు పతులు పెత్తనం చెలాయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి: కెవిపిఎస్

నర్సింహులపేట, జూన్ 17(నమస్తే న్యూస్)
స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని, మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలు అధికారాలు చలాయిస్తే సంబంధిత అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) మండల అధ్యక్షుడు కురంది సురేష్, కార్యదర్శి మందుల యాకూబ్ డిమాండ్ చేశారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మహిళల సాధికారతకు పెద్దపీట వేశారని, హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించాలని ఆకాంక్షించారని గుర్తు చేశారు. అదే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, మండలంలోని అనేక గ్రామపంచాయతీల్లో మహిళా సర్పంచులు స్వతంత్రంగా పాలన నిర్వహించకుండా వారి భర్తలే అధికారాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, మహిళల రాజకీయ సాధికారత లక్ష్యాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. మహిళలను వంటింటికే పరిమితం చేసి, ప్రజా వ్యవస్థలపై అనధికారికంగా పెత్తనం చెలాయించే పరిస్థితులను ప్రభుత్వం సహించరాదని అన్నారు.మహిళా సర్పంచులు, ఇతర మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ బాధ్యతలు నిర్వర్తించేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని, సతులకు బదులు పతులు అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
