Type Here to Get Search Results !

అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. హనుమకొండలో బాలుడిని పరామర్శించి రూ.1 లక్ష సాయం.

  • అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.
  • హనుమకొండలో బాలుడిని పరామర్శించి రూ.1 లక్ష సాయం.




వరంగల్ బ్యూరో, జూన్ 17 (నమస్తే న్యూస్):

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన అభిమాని కోరికను తెలుసుకున్న ఆయన స్వయంగా హనుమకొండకు వెళ్లి బాలుడిని పరామర్శించారు.దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.హనుమకొండ నగరంలోని హనుమాన్నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు.వ్యాధి కారణంగా శారీరక ఎదుగుదల దెబ్బతినడంతో చాలాకాలంగా ఇంటికే పరిమితమయ్యాడు.

ఈక్రమంలో తన అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలన్న కోరికను కుటుంబ సభ్యుల వద్ద వ్యక్తం చేశాడు.నిరంజన్ కోరికను కుటుంబ సభ్యులు తెలంగాణ జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తన ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి హనుమకొండకు చేరుకుని నిరంజన్‌ను ప్రత్యక్షంగా కలిశారు.ఈ సందర్భంగా నిరంజన్‌తో ఆప్యాయంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వైద్య చికిత్సలకు ఉపయోగపడేలా రూ.1 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే తీర్థప్రసాదాలను అందించి నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.నిరంజన్ ఆరోగ్య క్షేమం కోసం వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.అదే సమయంలో బాలుడి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని, కుటుంబానికి స్థిరమైన ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని జనసేన తెలంగాణ నాయకత్వానికి సూచించారు. జీవనోపాధి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా తమ ఇంటికి రావడం, పరామర్శించడంతో నిరంజన్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కష్టకాలంలో అండగా నిలిచి తమ కుమారుడి కోరికను నెరవేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.అభిమాని పట్ల పవన్ కళ్యాణ్ చూపిన ఆప్యాయత, మానవీయ స్పందన స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, మానవత్వంతో స్పందించే వ్యక్తిగా మరోసారి ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.