Type Here to Get Search Results !

మత్తు పదార్థాల నియంత్రణకు..! కట్టుదిట్టమైన చర్యలు:ఎస్సై రవికుమార్

మత్తు పదార్థాల నియంత్రణకు..! కట్టుదిట్టమైన చర్యలు
-ఎస్సై రవికుమార్ 



దంతాలపల్లి జూన్ 5 (నమస్తే న్యూస్)మత్తు పదార్థాల నియంత్రణకు దంతాలపల్లి పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక గంజాయి టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దంతాలపల్లి ఎస్సై రవికుమార్   తెలిపారు. దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అనుమానం వచ్చిన వ్యక్తులను ఈ ప్రత్యేక కిట్ల సహాయంతో అక్కడికక్కడే పరీక్షించి, కేవలం పది నిమిషాల్లోనే గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించే అవకాశం ఉందన్నారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి వద్ద ఈ కిట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.గంజాయి వినియోగదారులను శిక్షించడం కంటే వారిలో మార్పు తీసుకురావడమే పోలీసు శాఖ ప్రధాన ఉద్దేశమని ఎస్సై తెలిపారు . అందుకే మత్తు పదార్థాలకు అలవాటు పడిన  యువతను డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. దంతాలపల్లి మండలాన్ని సంపూర్ణ గంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు. మండలంలో ఎక్కడైనా గంజాయి విక్రయం, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే  87126 56976   నంబర్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.గంజాయి అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్న నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అయితే తెలిసీ తెలియక మత్తు పదార్థాల బారిన పడిన యువతను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.మంచి మార్పును కోరుకునే ప్రజలు, మేధావులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, జర్నలిస్టులు పోలీసు శాఖతో కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. అందరూ సమిష్టిగా కృషి చేస్తే దంతాలపల్లి  మండలంలో మత్తు పదార్థాలకు స్థానం ఉండదని ఎస్సై రవికుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ జన్నయ్య , ఆకుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.