మాదకద్రవ్యాల నివారణకు ప్రజలు సహకరించాలి:డీఎస్పీ కృష్ణ కిషోర్.
తొర్రూరులో పోలీసుల అవగాహన ర్యాలీ.
తొర్రూరు,జూన్ 26(నమస్తే న్యూస్): అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులపై బైక్ ర్యాలీ చేపట్టిన పోలీసులు, అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ, గంజాయి రహిత సమాజ నిర్మాణమే పోలీసు శాఖ లక్ష్యమని తెలిపారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక జీవితాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసినా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు పారితోషికం అందజేస్తామని తెలిపారు. రైతులు చట్టబద్ధమైన పంటల సాగుపై దృష్టి సారించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

