"నాన్న మాట"భవిష్యత్తుకు భాట.
చిన్నప్పుడు నాకు ప్రపంచంలో ఒకటే భయం.నాన్న దూరమైపోతాడేమో అని.
మానాన్న.గోపయ్య. పేరుకే కిరాణం షాపు ఓనర్ కానీ నాకు ఆయన దేవుడు,ఫ్రెండ్,హీరో అన్నీ.ఉదయం లేస్తే అర్ధరాత్రి దాకా కష్టం.కిరాణం పెట్టడు అందులో కొంత ఇబ్బంది ఏర్పడి తర్వాత బట్టల వ్యాపారం చేశాడు.ఏదీ చేసినా ఎంత కష్ట పడినా కలిసిరాలేదు.నష్టాలు అయినా మొహంలో చిరునవ్వు చెరిగిపోలేదు.ఎప్పుడు ఒకమాట చెప్పుతుండేవారు కష్ట పడ్డవారికి సుఖం దానంతట అదే వస్తుంది అని కనీ మా నాన్న చనిపోయేవరకు కష్టపడ్డారు,నాన్న సుఖాన్ని ఎప్పుడు కోరుకోలేదు,నా పిల్లలు సుఖంగా బ్రతకాలి అని శ్రమించేవారు,పొద్దున లేస్తే అదే ద్యాస,నాన్న ఉన్నాడని ధైర్యం.ఆ ధైర్యం వెళ్ళిపోయిందని తెలిసినరోజు ఏడ్చాను రోజాంతా ఏడ్చాను 20 సంవత్సరాలైనా నాన్నగారి జ్ఞాపకాలను మరువలేకపోతున్నాము.
నాకు ఏం కావాలన్నా ఒకటే మాట అనేవాడు:
"ఏ పని చేసినా ఆపనిని మనుస్ఫూర్తిగా చేయాలి,అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది అనేవారు.అలా చేయొద్దు నాన్నా,ఇది చేయొద్దు నాన్నా.తొందరపడకు.ఆలోచించి అడుగు వెయ్యి అని పదే పదే చెప్పేవారు,అప్పుడు తెలియని వయసో,మూర్ఖత్వమో వినేవాళ్ళం కాదు,ఆ మాటల విలువ తండ్రి విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది (గుర్తుకు వస్తుంది)."
అప్పుడు నాకు కోపం వచ్చేది."నాన్నకు ఏం తెలుసు.ఎప్పుడూ వద్దు వద్దు అంటాడు" అనుకునేవాడిని.అర్థం చేసుకునే వయసు కాదు కదా.
ఊర్లో జాతరకి వెళ్లి చెడు స్నేహాలు చేస్తానేమో అని,"వాళ్ళతో స్నేహం చేయవద్దు వెళ్లొద్దు నాన్నా" అనేవారు.డబ్బులు ఖర్చు పెడతానేమో అని,"అనవసరంగా ఖర్చు చేయొద్దు నాన్నా" అనేవారు.ఎవరితోనైనా గొడవ పడతానేమో అని,"మాట జారొద్దు నాన్నా,ఓర్పుగా ఉండు" అనేవారు.
వ్యాపారంలో ఎంత కష్ట పడ్డా,ఇంట్లో తిన్నామా తినలేదనేది తెలియనియ్యక పోయేవారు మా ముందు మాత్రం ధైర్యంగా నిలబడేవాడు."నాన్నా, మనం పడిపోయిన ప్రతిసారీ లేవాలి.నేను బతికున్నంత వరకు మీ చెయ్యి వదలను.ఇది మీ నాన్న మాట" అనేవాడు.
19-11-2006.
ఆ రోజు నాన్న మాట పడిపోయింది.స్వర్గస్తులైనారు.బెడ్ మీద నా చెయ్యి పట్టుకొని దగ్గరికి పిలుచుకొని ఆఖరి మాట అన్నాడు:*"వెంకటేశ్వర్లు,జాగ్రత్త నాన్నా.నేను చెప్పినట్టు నడుచుకో.అలా చేయొద్దు నాన్నా అని ఎందుకన్నానో,ఒకరోజు నీకే అర్థమవుతుంది.పడిపోకు.పడినా,లేవడం మర్చిపోకు."*
ఆ తర్వాత కళ్లు మూశాడు.ఇంక తెరవలేదు.
నాన్న పోయాకే తెలిసింది.ఆయన 'వద్దు' అన్న ప్రతి మాట వెనక ఒక తుఫానుని ఆపిన అనుభవం ఉంది.ఆయన పడ్డ ప్రతి దెబ్బ నాకు తగలకూడదని ఆయన తాపత్రయం. *ఇవాళ నాన్న చెప్పినట్టు నడిచుంటే,మంచి పొజిషన్‌లో ఉండేవాడినేమో* అని ఇప్పుడు రోజూ అనిపిస్తుంది.ఆయన మాట విలువ ఇప్పుడు తెలిసొస్తుంది నాన్నా.నాన్న ప్రేమలు పొందేవారు నాన్నలని గౌరవించండి,నాన్నలు చెప్పే మాటలు భవిష్యత్తుకు భాటలు వేస్తాయి,నాన్న మాట భవిష్యత్తుకు బంగారు భాట.
20 ఏళ్ల తర్వాత - ఫాదర్స్ డే_
ఈరోజు నేను,వెంకటేశ్వర్లు మా నాన్నగారు కిరాణం నడిపిన ఊరు బికుమళ్లకు పోయాను,అక్కడి పాత గోడలు మానాన్న జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి.కానీ ఆ గోడలకు ఇంకా నాన్న వాసన ఉంది.ఆ జాగాలో నాన్న చేసిన పనులు ఆయన తిరిగిన జాడలు ఇంకా గుర్తొస్తున్నాయి.
నా కొడుకు ఒక తప్పు చేయబోతుంటే,నా నోటి నుంచి తెలియకుండానే అదే మాట వచ్చింది: "అలా చేయొద్దు నాన్నా."
వాడు ఆగి నా వైపు చూశాడు.ఆ క్షణంలో నాకు అర్థమైంది.25 ఏళ్ల క్రితం నాన్న నా చెయ్యి పట్టుకున్నాడు.ఇవాళ నేను నా కొడుకు చెయ్యి పట్టుకున్నాను.నాన్న శరీరం లేదు.కానీ ఆయన మాట నాలో బతికే ఉంది.
అప్పుడు అనిపించింది.ఎవరో భుజం మీద చేయి వేసినట్టు.వెనక్కి తిరిగి చూశాను.ఎవరూ లేరు.కానీ గాలిలో అదే నాన్న రూపు...కిరాణం సంచుల,కొత్త బట్టల,చెమట కలిసిన మా నాన్న జ్ఞాపకాలు.
కళ్లలో నీళ్లు ధారలుగా కారుతుండగా ఆకాశం వైపు చూసి అరిచాను:
"నాన్నా,గోపయ్య! వినిపిస్తుందా? నువ్వు పోయిన రోజు నేను ఏడ్చాను.కానీ ఈరోజు అర్థమైంది.నువ్వు నా చెయ్యి వదిలేయలేదు.నా జీవితానికి దారి చూపించావ్.నువ్వు 'వద్దు' అన్న ప్రతి మాటా,నన్ను పడిపోకుండా కాపాడిన ఒక అడ్డుగోడ."
"ఇవాళ నేను నా కొడుకుకి 'అలా చేయొద్దు నాన్నా' అని చెప్తున్నాను.నీలాగే,నేను కూడా వాడి వెనకే ఉంటాను.కనిపించినా,కనిపించకపోయినా."
"థాంక్స్ నాన్నా.నన్ను తప్పు దారిలో వెళ్లనివ్వనందుకు.పడినా లేపినందుకు.ఇప్పుడు నువ్వు లేకపోయినా,నువ్వు చెప్పిన మాట,ఇచ్చిన ధైర్యం నాతోనే ఉంది.నువ్వు చెప్పినట్టు నడుచుకోలేకపోయాను.కానీ నీ మనవడిని నీ మాటతో పెంచుతాను."
అంటే మనతో పాటు వ్యాపారం చేసే భాగస్వామి కాదు.మనం నష్టపోతామేమో అని,తను ప్రాణం పెట్టి కష్టపడే ఒక పిచ్చి ప్రేమ.ఆ ప్రేమ చనిపోదు.అది 'అలా చేయొద్దు నాన్నా' అనే మాటలా తరతరాలకు జీవితాన్ని నేర్పిస్తూనే ఉంటుంది.
నాన్నలు దేవుళ్ళు కాదు.కానీ దేవుడు లేని లోటు తెలియనివ్వని దేవుళ్ళు.
నాన్నల జ్ఞాపకాలను మరచిపోలేము(మరుపురాదు)జీవితమే నాన్న,జీవితానికి అర్ధమే నాన్న.
నేను మిమ్ముల్ని మరచిపోలేక పోతున్నాను నాన్నా.మీరెక్కడున్నా మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకుండాలి నాన్నా.నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు నాన్న .

