- గుండె పూడిలో పోలీసుల కార్డెన్ సెర్చ్.
- నకిలీ బీటీ-3 విత్తనాలపై భారీ దాడులు..నివాస గృహాలలో విత్తనాలు స్వాధీనం.
- నకిలీ విత్తనాల మాఫియాపై మహబూబాబాద్ పోలీసుల ఉక్కుపాదం.
మహబూబాబాద్, జూన్ 21 (నమస్తే న్యూస్): రైతులను మోసం చేస్తున్న నకిలీ బీటీ-3 విత్తనాల మాఫియాపై మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు డీఎస్పీ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో మరిపెడ పోలీసులు గుండేపూడి గ్రామంలో శనివారం విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.పక్కా సమాచారంతో చేపట్టిన ఈ దాడుల్లో గ్రామంలోని పలు నివాసాలు, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా కొన్ని కిలోల నకిలీ బీటీ-3 విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యక్తుల వివరాలను సేకరిస్తూ, నకిలీ విత్తనాల సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అనంతరం గ్రామంలో రైతులకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నకిలీ బీటీ-3 విత్తనాల వల్ల పంట దిగుబడులు దెబ్బతినడంతో పాటు రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వివరించారు. ప్రభుత్వం అనుమతించిన ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల విక్రేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. నకిలీ విత్తనాల తయారీ, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ దాడుల్లో సీఐ పవన్ కుమార్, ఎస్సైలు గండ్రాతి సతీష్, సంతోష్, కుశకుమార్, ప్రభాకర్ రెడ్డి తదితరులతో పాటు సుమారు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, రైతులు అనుమానాస్పద విత్తనాల గురించి వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.

