- గాలివారిగూడెంలో ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ
- సమస్యల పరిష్కారం - గ్రామాభివృద్ధే లక్ష్యం : సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్
- సీజనల్ వ్యాధులు, పోషకాహారంపై అధికారుల అవగాహన.
ఈ సందర్భంగా సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. గ్రామంలోని తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గాలివారిగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.గ్రామ సభలో పాల్గొన్న ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉష మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రక్తహీనత నివారణకు ఆకుకూరలు, పప్పు దినుసులు, సమతుల ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.సహాయ ఇంజనీర్ గ్రామంలో కొనసాగుతున్న సీసీ రోడ్లు, మురుగు కాలువలు, మిషన్ భగీరథ పనుల పురోగతిని వివరించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పనుల్లో లోపాలు గమనిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.సభ ముగింపులో గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతి పత్రాలు సమర్పించారు. వాటిపై అధికారులు సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


