Type Here to Get Search Results !

పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి: ఏఐకేఎంఎస్

పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి
ఏఐకేఎంఎస్ డిమాండ్


మహబూబాబాద్, జూన్ 06 (నమస్తే న్యూస్):
ప్రైవేట్ కంపెనీలు ఏకపక్షంగా పెంచిన ఎరువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఎరువుల ధరల పెరుగుదలపై ప్రభుత్వాలకు నియంత్రణ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ విమర్శించారు.శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్య భవనంలో నిర్వహించిన ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రైవేట్ కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలను బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచడం రైతులపై మరింత భారం మోపిందన్నారు. పెంచిన ధరలను తగ్గించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.రైతులు పండించే అన్ని రకాల పంటలకు వాస్తవ సాగు వ్యయాలను పరిగణనలోకి తీసుకుని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు సీ2+50 శాతం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామమాత్రపు మద్దతు ధరల పెంపును పునఃసమీక్షించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు.కల్తీ విత్తనాలు, నాసిరకం ఎరువుల విక్రయాలను అరికట్టడంతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు సరిపడా అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ రుణాలను సకాలంలో మంజూరు చేయాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వరి బోనస్‌కు సంబంధించిన బకాయిలతో పాటు ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన ప్రోత్సాహకాలను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.కళ్లాలపై నిల్వ ఉన్న వరి, మొక్కజొన్న పంటల కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు తోకల వెంకన్న, చింతా వెంకన్న, రామగిరి బిక్షం, నున్న ఉపేందర్, దేవపంగు బిక్షం, పూణెం పాపారావు, మట్టపెల్లి వీరభద్రం, టేకుమట్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.