- జాగృతి పోలీస్ కళాబృందం ద్వారా సామాజిక అంశాలపై విస్తృత అవగాహన
- రూప్లా తండలో ప్రత్యేక ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం
- మత్తులో యువత భవిష్యత్తు చిత్తు.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత.
- పోలీస్ కళజాతి బృందం నాటక ప్రదర్శన సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
- నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్న

నర్సింహులపేట,జూన్ 22 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్లా తండ గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం వివిధ సామాజిక అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్, సీఐ గణేష్ ఆదేశాల మేరకు నర్సింహులపేట ఎస్సై భానోతు వెంకన్న అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సైబర్ నేరాల నివారణ, మూఢనమ్మకాల నిర్మూలన, ఆన్‌లైన్ గేమింగ్ దుష్ప్రభావాలు, రోడ్డు భద్రతా నియమాలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాల నివారణ వంటి కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.పాటలు, పల్లెసుద్దులు, మ్యాజిక్ షోలు, నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా కళాబృందం సభ్యులు సామాజిక సందేశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించడంతో పాటు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎస్సై భానోతు వెంకన్న మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవాలని సూచించారు. అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.కళాబృందం ప్రదర్శనలను గ్రామస్తులు ఆసక్తిగా వీక్షించగా, యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రూప్లా తండ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. సుమారు 200 మంది గ్రామ ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

