Type Here to Get Search Results !

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం... ఎడమ చేతిని కోల్పోయిన పసికందు.

 

  • ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..?
  • ఏడు నెలల పసికందు చేయి కోల్పోయిన విషాద ఘటన.
  • వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తీవ్ర ఆగ్రహం.
  • బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్.




సూర్యాపేట జిల్లా,మే31(నమస్తే న్యూస్)

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ ఏడు నెలల పసికందు చేయిని కోల్పోయిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపాటి సూర్యకాంత్-రేణుక దంపతులకు ఏడు నెలల గర్భధారణలోనే కవల పిల్లలు జన్మించారు. వారిలో ఒక బాలుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ ఏడాది మార్చి 4న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు.

బాలుడికి రక్తహీనత ఉండటంతో రక్తం ఎక్కించే క్రమంలో కాన్యులా ఏర్పాటు చేసిన ప్రాంతంలో వాపు రావడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు వైద్యుల దృష్టికి తీసుకెళ్లినా, అది పెద్ద సమస్య కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రోజులు గడుస్తున్నా వాపు తగ్గకపోవడం, చేయి నల్లబడిపోవడంతో మరోసారి ప్రశ్నించగా ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.

స్కానింగ్ నివేదికలో చేతి కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మార్చి 26న బాలుడిని హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు చేయి పూర్తిగా దెబ్బతిన్నందున తొలగించడం తప్ప మరో మార్గం లేదని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన తల్లిదండ్రులు చివరికి శస్త్రచికిత్సకు అంగీకరించాల్సి వచ్చిందన్నారు.

ఈ ఘటనపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మోతే మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు జీవితాంతం వికలాంగుడిగా మారడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.బాలుడి చేయి కోల్పోవడానికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించడంతో పాటు బాలుడి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం మోతే మండల అధ్యక్షుడు జిల్లేపల్లి శివకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్, విద్యార్థి నాయకులు కుర్షిత్, కోర్ర రమేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.