ఆధునిక శాస్త్రీయ సాగుతో రైతులకు అధిక ఆదాయం.
:ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి.
డోర్నకల్, 16 మే (నమస్తే న్యూస్): ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో సాగు చేస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. డోర్నకల్ మండలం చిలుకొడు గ్రామ రైతు వేదికలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక సాగు విధానాలను రైతులు ఆచరణలో పెట్టి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ భూసార పరీక్షలు, వ్యవసాయ పనిముట్ల పంపిణీ, ఉద్యాన పంటల ప్రోత్సాహానికి సబ్సిడీలు అందిస్తోందన్నారు.కేవీకే మల్యాల శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ పంట వ్యర్థాలను కాల్చొద్దని, పంట మార్పిడి విధానంతో భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. అధికంగా పురుగుమందులు, యూరియా వినియోగం వల్ల కాన్సర్ వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉందని రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, ఏఓ అనిల్, సర్పంచులు చిర్రా వీరభద్రం, అనిల్, ఆత్మ డైరెక్టర్ అనంతరెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


