•ప్రజా సమస్యల పరిష్కారమే అధికారుల మొదటి ప్రాధాన్యత: కలెక్టర్ స్నేహ శబరీష్
•ప్రజావాణిలో 132 అర్జీలు స్వీకరణ.
•రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ హెచ్చరిక.
మహబూబాబాద్, మే 18 (నమస్తే న్యూస్):
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడం అధికారుల మొదటి బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్‌తో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎంతో ఆశతో ప్రజావాణికి వస్తారని, ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయకుండా బాధితులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, తిరస్కరణకు గురైన దరఖాస్తులకు కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.
ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో ధరణి సమస్యలు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూ వివాదాలు, తాగునీటి సమస్యలు, వైద్య సేవలకు సంబంధించిన పలు అర్జీలు అందాయి. మహబూబాబాద్ మండలం చోక్లాతండా, మేఘ్యాతండ ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని గ్రామస్థులు రెండు బోర్లు ఏర్పాటు చేయాలని కోరగా, బయ్యారం మండలం మిర్యాలపెంట పీహెచ్‌సీలో ఎంబీబీఎస్ డాక్టర్ నియామకం చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు బయ్యారం మండలంలోని ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించి అక్రమ ఆక్రమణలను గుర్తించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 132 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

