గ్రామాల అభివృద్ధిలో ఉద్యోగుల అంకితభావం ఎంతో అవసరమ
- కలెక్టర్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్, మే 7 (నమస్తే న్యూస్) : గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సానిటేషన్, త్రాగునీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర అంశాలపై ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఎంపీడీవోలకు సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరును నిబంధనల ప్రకారం కమిటీల ద్వారా పారదర్శకంగా అందించాలని, ఇప్పటికే మంజూరైన ఇండ్ల వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడంతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి లేబర్ టర్నోవర్ పెంచాలని, అంతర్గత రహదారులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని గ్రామస్థాయిలో అమలు చేయాలని చెప్పారు.గ్రామాల అభివృద్ధిలో ఉద్యోగుల అంకితభావం ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, అన్ని మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

