ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు.
మహబూబాబాద్, మే 07 (నమస్తే న్యూస్): ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 అమలు, లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ ప్రక్రియపై జిల్లా, మండల కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రూ.1 లక్ష విలువైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 90 శాతం సబ్సిడీతో, రూ.2.40 లక్షల పాడి గేదెల యూనిట్లు, రూ.3 లక్షల గూడ్స్/ప్యాసింజర్ త్రిచక్ర వాహనాలు 70 శాతం సబ్సిడీతో, రూ.3 నుంచి 7 లక్షల విలువైన సోలార్ పంప్ సెట్లు 100 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో అర్హులైన ఎస్సీ అభ్యర్థులను గుర్తించి త్వరితగతిన గ్రౌండింగ్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
బ్యాంకులు రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, ఎల్డీఎం యాదగిరి, పరిశ్రమల అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, పశువైద్య శాఖ అధికారి కిరణ్ కుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

