ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘ప్రతిభ పురస్కారం’.
మహబూబాబాద్, మే 31 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానిస్తూ "ప్రతిభ పురస్కారం" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి ప్రథమ ర్యాంకర్లు, వివిధ ప్రభుత్వ, గురుకుల, ప్రైవేట్ పాఠశాలల టాపర్లను శాలువాలు, మెమెంటోలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు.అసోసియేషన్ అధ్యక్షుడు గండు మురళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఒక విజయంతో ఆగిపోకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా గండు మురళి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. విద్యా రంగంలో రాణించిన విద్యార్థులను ప్రోత్సహించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దిలీప్, నర్రా సంధ్య, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ మదార్, అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

