పెద్దనాగరం స్టేజి గ్రామంలో నిఘా కెమెరాల ఏర్పాటు.
గ్రామ భద్రతకు సర్పంచ్, పోలీసుల సంయుక్త చర్య.
నర్సింహులపేట,29 మే (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం స్టేజి గ్రామపంచాయతీలో గ్రామ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, రహదారుల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు.గ్రామపంచాయతీ సర్పంచ్ సోనియా హరిలాల్, ఉప సర్పంచ్ రవిబాబు, స్థానిక ఎస్సై బానోతు వెంకన్న ఆధ్వర్యంలో ఈ నిఘా కెమెరాల ఏర్పాటును ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ సోనియా హరిలాల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలో అనుమానాస్పద కదలికలు, చోరీలు, ఇతర నేర కార్యకలాపాలను అరికట్టేందుకు నిఘా కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలు కూడా గ్రామ భద్రతపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.స్థానిక ఎస్సై బానోతు వెంకన్న మాట్లాడుతూ,ఆధునిక సాంకేతికతను వినియోగించి గ్రామాల్లో నేరాలను తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామ ప్రజలు కెమెరాల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.ఉప సర్పంచ్ రవిబాబు మాట్లాడుతూ, గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

