ప్రత్యేక ప్రార్థనలతో బక్రీద్ పండగ సంబరాలు
మతసామరస్యంతో వెల్లువెరిసిన నర్సింహులపేట.
నర్సింహులపేట,28 మే (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కబురస్తాన్‌లో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. త్యాగం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకగా భావించే ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం భక్తులు గురువారం ఉదయం నుంచే కబురస్తాన్‌కు తరలివచ్చారు.ఉదయం 7 గంటల నుంచి మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజ్ కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలని కోరుతూ ప్రత్యేక దువాలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ సందర్భంగా కబురస్తాన్ పరిసరాలు ప్రార్థనలతో, భక్తి వాతావరణంతో కళకళలాడాయి. మండల ప్రజలు సైతం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక ఐక్యతను చాటుకున్నారు.ఇదిలా ఉండగా, నర్సింహులపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఎస్.కె. నహీం పాషా, స్థానిక ఎస్సై భానోత్ వెంకన్న ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మిఠాయిలు తినిపించుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ దృశ్యం అక్కడి వారిని ఆకట్టుకుని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.


