అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- ప్రజా దర్బార్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
- మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
- పనుల్లో వేగం పెంచాలని అధికారులకు రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశం
మహబూబాబాద్/కొత్తగూడ, మే 27 (నమస్తే న్యూస్):
ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్య ఉద్దేశంగా పాలనను ప్రజల వద్దకే తీసుకువస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడ ఏజెన్సీ ఓటాయి గ్రామం, కొత్తగూడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్‌లతో కలిసి మంత్రి ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వయంగా దరఖాస్తులను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, చట్టపరిధిలో ప్రతి అర్జీని వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట..
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల స్వయం ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి గతంలో ఉన్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రూ.10 లక్షల వరకు పెంచినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు మహిళా సంఘాలలో సభ్యులుగా ఉంటే అదనంగా రూ.లక్ష ఆర్థిక భరోసా అందిస్తామన్నారు. అలాగే మహిళల ఆత్మగౌరవం కోసం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమైక్య భవనాలను నిర్మించనున్నట్లు, అందులో భాగంగానే మండల పరిధిలో ఇప్పటికే 40 భవనాలకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత అభివృద్ధి, సీసీ రోడ్లు, చెక్ డ్యాములు, కరెంటు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేశామని, ఈ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం (100 రోజుల పనులు) కింద కూలీల సంఖ్యను పెంచి, గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. రైతుల పొలాల బాటల రహదారుల నిర్మాణం విషయంలో అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యంగా జిల్లాకు కేటాయించిన కోటాకు అదనంగా మరో 2 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ఇండ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులను మంత్రి సన్మానించారు.
309 దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్ స్నేహ శబరిష్
ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణిస్తామని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్‌లలో ఓటాయిలో 167, కొత్తగూడలో 142 చొప్పున మొత్తం 309 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటి పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటుందని మంత్రికి వివరించారు.ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ విశాల్ బత్తుల, ఆర్డీఓ కృష్ణవేణి, జడ్పీ సీఈఓ పురుషోత్తం, ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, డీఆర్డీఓ మధుసూదన రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


