Type Here to Get Search Results !

ఇసుక పర్మిషన్ మాటున అధికారుల వాటా..?

ఇసుక పర్మిషన్ మాటున అధికారుల వాటా..?

ఆకేరువాగులో యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా.

ఆరు దాటితే ఆగని ట్రాక్టర్ల రవాణా.

కూతవేటు దూరంలోనే పోలీస్, రెవెన్యూ, మండల కార్యాలయాలు.

ఇసుక వ్యాపారులకు అండగా నిలుస్తున్నదెవరు..?




నర్సింహులపేట, 15 మే (నమస్తే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని జయపురం, కౌసల్యదేవిపల్లి, బక్కతండా గ్రామపంచాయతీల సమీపంలోని ఆకేరువాగులో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. వాగు నుంచి తరలిస్తున్న ప్రతి ట్రాక్టర్‌పై “టాక్స్” పేరుతో బహిరంగంగా వసూళ్లు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ల రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

        ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మరింత వేగంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతానికి కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయం, మండల కార్యాలయాలు ఉన్నప్పటికీ ఎలాంటి నియంత్రణ చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. “మా వాటా మాకు వస్తోంది” అనే ధీమాతో కొందరు అధికారులు మౌనంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.అభివృద్ధి పనుల కోసం అంటూ వాగు నుంచి భారీగా ఇసుకను తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయం ఖజానాకు చేరకుండా మధ్యలోనే మాయమవుతోందని ప్రజలు మండిపడుతున్నారు.

          ఇసుక మాఫియా, స్థానిక దళారులు, కొందరు అధికారుల మధ్య కుమ్మక్కు కారణంగానే ఈ అక్రమ వ్యవహారం నిరాటంకంగా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత శాఖలు స్పందించకపోవడంతో గ్రామస్తుల్లో అసహనం పెరుగుతోంది. ఆకేరువాగులో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి, అక్రమ వసూళ్లు నిర్వహిస్తున్న వారితో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.