మండల కేంద్రంలో ఏరులైపాడుతున్న మద్యం దందా..!
యువతతో పాటు మత్తులో చిత్తవుతున్న మైనర్లు..!
ఆలయాలు, పాఠశాలల సమీపాల్లోనూ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.
పర్మిషన్ లేకుండా సిట్టింగులు.. రోడ్లపైనే మద్యం సేవిస్తున్న మందుబాబులు.
నర్సింహులపేట పవిత్రతను మంటగలుపుతున్న మద్యం విక్రయాలు.
నర్సింహులపేట, మే 15 (నమస్తే న్యూస్):
ఆలయాలకు నిలయంగా, ప్రశాంత వాతావరణానికి పేరుగాంచిన నర్సింహులపేట మండల కేంద్రంలో మద్యం విక్రయాలు రోజురోజుకు అదుపు తప్పుతున్నాయనే విమర్శలు ప్రజల నుంచి తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్న మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపులు, అక్రమ సిట్టింగులు ఏటీఎంల మాదిరిగా “ఎనీ టైం మందు” అందుబాటులో ఉంచుతూ యువతను మత్తు బారిన పడేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల సమీపాల్లోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు సాగుతుండటంతో యువతతో పాటు కొంతమంది మైనర్లు కూడా మద్యం అలవాటుకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా మద్యం సులభంగా అందుబాటులో ఉండటం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మండల కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండానే సిట్టింగులు ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం సేవించే పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల పక్కన, దుకాణాల ముందు, ఖాళీ ప్రదేశాల్లో మందుబాబులు గుంపులుగా కూర్చొని మద్యం సేవించడం వల్ల మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాత్రి వేళల్లో గొడవలు, అసభ్య ప్రవర్తనలు పెరుగుతున్నాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన లక్ష్యంగా మారిందా..? ప్రజారోగ్యం, యువత భవిష్యత్తు, సామాజిక విలువలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. విద్యావంతుల విజ్ఞత లిక్కర్ బాటిళ్లలో బందీ అవుతోందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ప్రతిరోజూ ఇదే మార్గాల్లో తిరిగే ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులు ఈ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. బెల్ట్ షాపులు, అక్రమ సిట్టింగులు బహిరంగంగానే కొనసాగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నర్సింహులపేట మండల కేంద్రంలో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు, అనధికార సిట్టింగులపై ప్రత్యేక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆలయాల పవిత్రత, విద్యార్థుల భవిష్యత్తు, మహిళల భద్రత దృష్ట్యా మద్యం నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నారు.



