నీటిపాలైన ధాన్యం రాశులు...రైతుల కళ్ళల్లో కడగండ్లు.
అకాల వర్షంతో... అన్నదాతకు అపార నష్టం.
గత కొన్నిరోజులుగా కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేసిన రైతులు.
రైతుల విన్నపాలు పట్టించుకోకుండా కాల యాపన చేసిన సిబ్బంది.
ముందస్తు చర్యలు తీసుకోకుండా....అలసత్వం వహించిన స్థానిక అధికారులు.
రైతులను తక్షణమే ఆదుకోవాలి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
నర్సింహులపేట, మే 03 (నమస్తే న్యూస్):ఆదివారం మధ్యాహ్నం వరకూ ఎండగానే ఉన్న ఆకాశం, సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. కొద్ది సేపటికే ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ వర్షం కొందరికి చల్లని ఉపశమనం అయితే…నర్సింహులపేట రైతులకు మాత్రం కన్నీటి వరదగా మారింది.కొనుగోలు కేంద్రం ప్రాంగణంలో వరుసగా కుప్పలుగా వేసిన వరి ధాన్యం… క్షణాల్లో నీటిలో తడిసి ముద్దయింది.వర్షపు జల్లు కురుస్తుండగా, కొందరు తాడిపత్రాలు, కొందరు పాత టెంట్లు తెచ్చి ధాన్యంపై కప్పేందుకు ప్రయత్నించారు. కానీ ప్రకృతి ఆగ్రహం ముందు ఆ ప్రయత్నాలు నిలవలేదు.రేఖ పద్మ అనే మహిళా రైతు, తన ధాన్యం కుప్ప పక్కన నిలబడి, తడిసిన గింజలను చేతిలో తీసుకుని, “దేవుడా… మా నోటికాడి అన్నాన్ని ఆగం చేయకు” అంటూ కన్నీరు మున్నీరైంది.గత వారం రోజులుగా కొనుగోలు పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ఆలస్యం కారణంగా కొనుగోళ్లు పూర్తి కాలేదు. ఇదే సమయంలో అకాల వర్షం దెబ్బతో రైతుల కష్టానికి నీటిపాలయింది.ముందే కొనుగోలు చేసి ఉండి ఉంటే ఈ నష్టం ఉండేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు ముప్పై మంది రైతులు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి, కొనుగోలు కేంద్రం వద్ద రోజూ రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యం నాణ్యత తగ్గిపోతుందనే భయం, మరోవైపు తీసుకున్న అప్పుల భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారు.రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని, తడిసిన ధాన్యానికి కూడా పూర్తి మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా ప్రభుత్వాలు మారినా, మారని అధికారుల,పాలకుల తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.






