కృష్ణా–గోదావరి జలాలపై రాజీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు – సీఎం స్పష్టం
గత తప్పిదాలను సరిదిద్దుకుంటాం
నదీ జలాలపై వ్యూహాత్మక చర్యలు – సీఎం
కృష్ణా–గోదావరి జలాల్లో అన్యాయం సరిదిద్దుతాం: రేవంత్ రెడ్డి
(నమస్తే న్యూస్,జనవరి 01, హైదరాబాద్ )
హైదరాబాద్: కృష్ణా–గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులపై ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని తెలిపారు. జ్యోతీరావు ఫూలే ప్రజాభవన్‌లో కృష్ణా, గోదావరి జలాలు మరియు పెండింగ్ ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో విభజన సమయంలో తెలంగాణకు రావాల్సిన వాటా 71 శాతం ఉండగా, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం కేటాయించడంతో అన్యాయం జరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని తీసుకునే పాయింట్ మార్చడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని, డీపీఆర్ లేకుండానే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. నదీ జలాలపై జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమే తమ లక్ష్యమని, రాజకీయ లాభనష్టాల కోసం ఈ అంశాన్ని ఉపయోగించబోమని స్పష్టం చేశారు. కృష్ణా–గోదావరి జలాలపై ఉన్న అపోహలను నివృత్తి చేయడానికి శాసనసభలో సమగ్ర వివరాలు ప్రవేశపెడతామని తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన ఈ అంశంపై చర్చకు అన్ని సభ్యులు తప్పకుండా హాజరుకావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.



