వాస్తవాలను వెల్లడించిన తొర్రూరు డీఎస్పీ

మహబూబాబాద్, జూలై 15 (నమస్తే న్యూస్): తొర్రూరు డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన ఓ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోలీసు శాఖపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ) కె. కృష్ణ కిషోర్ స్పష్టం చేశారు.డీఎస్పీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జూలై 15న కొర్లకుంట తండాకు చెందిన ధరావత్ చరణ్ (19)పై 16 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు కానుందనే భయంతో అతను స్వగ్రామంలో పురుగుల మందు సేవించినట్లు తెలిపారు.ఈ ఘటనను కొందరు వ్యక్తులు పోలీసు శాఖను అపఖ్యాతిపాలు చేయాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా సంబంధిత పోలీస్ స్టేషన్కు పంపినట్లు తెలిపారు. అలాగే, నిందితుడిని నిబంధనల ప్రకారం పెద్దమనుషుల పూచీకత్తుపై అప్పగించామని, బాధితురాలికి చట్టబద్ధమైన న్యాయం జరిగేలా అవసరమైన చర్యలే చేపట్టామని వెల్లడించారు.ఈ వ్యవహారంలో పోలీసులు ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని డీఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా దుష్ప్రచారమేనని పేర్కొన్నారు.ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార సమాచారాన్ని నమ్మవద్దని, వాస్తవాలను నిర్ధారించకుండా వాటిని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక సమాచారం కోసం పోలీసు శాఖ విడుదల చేసే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని డీఎస్పీ కె. కృష్ణ కిషోర్ కోరారు.
