
తిరుమలాయపాలెం,జూలై 19 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ హత్య ఉదాంతం పై స్థానిక శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నగల కోసం వృద్ధురాలైన సుగుణమ్మను దొంగలు అత్యంత ఘోరంగా గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే.ఆదివారం పిండిప్రోలు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్త చెన్నా జనార్ధన్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామంలో స్థానిక ప్రజలతో మరియు నాయకులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను, అక్కడి భయాందోళనలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నిన్నటి రోజునే (శనివారం) ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ కి అధికారికంగా లేఖ రాశారు. పిండిప్రోలు తన సొంత గ్రామం అయినందున, ఈ దారుణ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించి తక్షణమే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని సీపీ ని కోరారు. ఇలాంటి ఘోరాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి పూట పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయాలని, ఆయన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చామకూరి రాజ్ కుమార్, గ్రామ పెద్దలు చామకూరి వెంకన్న, చామకూరి సునీల్ చిట్టి, చామకూరి కిరణ్, వార్డ్ నెంబర్ పసలది ముత్తయ్య, చామకూరి కృష్ణయ్య , ఊడుగుల బిక్షం, టిఆర్ఎస్ మండల నాయకులు బిల్లగిరి ధనంజయ, బి ఆర్ ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు గుంటి పుల్లయ్య బిల్లగిరి వెంకటేశ్వర్లు పగిడిపల్లి బాబు వంగూరి బాబు ఏళ్లే కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

