నీళ్ల కోసం లక్షలు ఖర్చు.. చివరికి కన్నీళ్లే మిగిలాయి..!
భూగర్భ జలం అడుగంటింది.. బోర్లన్నీ బూడిదలో పోసిన పన్నీరే..!
ఒక ఎకరంలో పది బోర్లు.. అయినా నీటి జాడ లేదు..! రైతు ఆవేదన
వర్షాకాలంలోనూ ఎండిన ఆశలు.. నీళ్లందక ‘బోరు’మంటున్న రైతన్న..!
ఏడు ఖండాల బావి.. పది బోర్లు.. అయినా చుక్కనీరు లేదు..!

నర్సింహులపేట, జూలై 19 (నమస్తే న్యూస్)
వర్షాకాలంలో పంటలు పచ్చగా కళకళలాడాల్సిన వేళ, నీటి కొరత అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తోంది. అప్పులు చేసి సాగుకు సిద్ధమైన రైతులు భూగర్భ జలాల కోసం బోర్లు వేయించినా చుక్కనీరు పడక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. భూమిని నమ్ముకుని బతికే రైతుకు ప్రకృతి పరీక్షగా మారిన ఈ పరిస్థితి నర్సింహులపేట మండలంలో పలుచోట్ల కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, రైతు చెలిమిల్ల బిక్షం తనకున్న ఒక ఎకరం పొలంలో పంటను కాపాడుకోవాలనే ఆశతో ముందుగా ఏడు ఖండాల బావిని తవ్వించాడు. అయితే భూగర్భ జలాలు అందక ఆ బావి పూర్తిగా నిరుపయోగంగా మారింది. దీంతో చివరి ఆశగా బోర్లు వేయించాలని నిర్ణయించాడు.ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా ఒక ఎకరం పొలంలో పది చోట్ల బోర్లు వేయించినా ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. బోర్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడమే కాకుండా అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నీరు అందకపోవడంతో సాగు చేయాలన్న ఆశలు ఆవిరయ్యాయి. పంటలు ఎండిపోతాయనే ఆందోళనతో పొలంలో నిలబడి కన్నీటి పర్యంతమైన రైతు బిక్షం పరిస్థితి గ్రామస్థులను సైతం కలచివేసింది.
సాగునీటి వసతి లేకపోవడంతో పొలాన్ని కౌలుకు ఇవ్వాలని ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. ఒక రైతు ఆసక్తి చూపినప్పటికీ, నీటి పరిస్థితిని పరిశీలించిన తర్వాత అసంతృప్తితో వెనుదిరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో భూమి ఉన్నా సాగు చేయలేని దుస్థితిలో రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగు సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోందని చెబుతున్నారు.భూగర్భ జలాల పరిస్థితిపై అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి, ప్రత్యామ్నాయ సాగునీటి వనరులు కల్పించడంతో పాటు నష్టపోయిన రైతులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.

