ఇచ్చిన మాటకు కట్టుబడి… సొంత జీతంతో పేద విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ.
శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
తొర్రూరు,జూలై 13(నమస్తే న్యూస్)
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి తన సొంత జీతంతో పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి మరోసారి సేవాభావాన్ని చాటుకున్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సహకారంతో గత 45 రోజులుగా నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా పూర్తికాగా, సోమవారం శిక్షణ పొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా సాంకేతిక విద్యలో ముందుండాలనే ఉద్దేశంతో తన నెలవారీ జీతం నుంచి నిధులు కేటాయించి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు మాట్లాడుతూ, ఉచితంగా కంప్యూటర్ శిక్షణతో పాటు సర్టిఫికెట్ పొందడం తమ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.తమలాంటి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండా శిక్షణ అందించడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.తల్లిదండ్రులు సైతం ఎమ్మెల్యే చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ,పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆచరణలో చూపించడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

