ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనుల గుర్తింపు
గ్రామ సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, అక్టోబర్ 2 (నమస్తే న్యూస్)
వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా తిరుమలాయపాలెం మండలం సోలిపురం గ్రామం లో శుక్రవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామాభివృద్ధి, ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, మౌలిక వసతులపై చర్చించారు.
గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత పనులను గుర్తించాలని నిర్ణయించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏఈఓ సాధన సూచించారు. ఫార్మ్ పాండ్స్, నీటి కుంటలు, జలసిరి కుంటల ద్వారా నీటిని సంరక్షించుకోవాలని రైతులకు సూచించారు.
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి 125 రోజుల పని కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సమావేశంలో చర్చించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జ్యోతి పీక్లా, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, ఫీల్డ్ అసిస్టెంట్ బి.అంజయ్య, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
