ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, అక్టోబర్ 2 (నమస్తే న్యూస్):
తిరుమలాయపాలెం మండలం లోని పిండిప్రోలు గ్రామం లో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కమిటీల పనితీరుపై పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు అధికారులను ప్రశ్నించడంతో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.గ్రామపంచాయతీకి సరైన సమాచారం, ప్రమేయం లేకుండా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందని పాలకవర్గ సభ్యులు ప్రశ్నించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామసభకు హాజరైన ఏపీవో అప్పారావు గ్రామ సభ నుండి మధ్యలోనే వెళ్లిపోయారు.గ్రామసభను రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహించాలని గ్రామస్థులు కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించి, అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కామల్ల సువార్త, ఉపసర్పంచ్ చామకూరి రాజ్‌కుమార్, ఏపీవో అప్పారావు, పంచాయతీ కార్యదర్శి మాధవి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

