జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి.
గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందచేస్తూ నిరసన వ్యక్తం.
జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
విధి నిర్వహణలో భద్రత కల్పించాలి.
కుటుంబాలకు ఉపయోగపడేలా హెల్త్ కార్డులు అందించాలి.
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, అక్టోబర్ 2 ( నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలంలో విధులు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించి, హెల్త్ కార్డులు అందించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఐజేయూ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిరంతరం విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చాలని కోరారు. అలాగే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.విధి నిర్వహణలో జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, జర్నలిస్టుల హక్కులు, సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తిరుమలాయపాలెం మండల జర్నలిస్టులు మేకల నాగరాజు, కూరపాటి వెంకయ్య, గుజ్జ రామకృష్ణ, గోవింద సురేష్, గాదారి వెంకన్న పాల్గొన్నారు.
