సీరోల్, అక్టోబర్ 03(నమస్తే న్యూస్ డెస్క్)
సీరోల్ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక తరలిస్తున్నారని చెబుతున్నారు.తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు గ్రామంలోని ప్రధాన రహదారులపై రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఓవర్లోడ్తో పాటు అధిక వేగంతో ట్రాక్టర్లు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పొంచి ఉందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక రవాణాపై నిఘా పెట్టాల్సిన సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్ల రాకపోకలపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే ఈ విషయంపై పై అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
