తొలిముద్దు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ బాలు నాయక్
నర్సింహులపేట, అక్టోబర్ 3 (నమస్తే న్యూస్)
చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని వంతడుపుల గ్రామ సర్పంచ్ మాలోత్ బాలు నాయక్ అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు తొలిముద్దు పోషకాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులకు పోషకాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గంధం వినయ్ కుమార్, ఉప సర్పంచ్ యాకూబ్, పంచాయతీ కార్యదర్శి నాగార్జున్, అంగన్వాడీ టీచర్లు మాధవి, లక్ష్మమ్మ, సుజాత, వీవో శశిరేఖ, ఆశా వర్కర్ లీల, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
