నషాముక్తి, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన – ప్రతిజ్ఞ,
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 28 (నమస్తే న్యూస్ )
మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పిండిప్రోలు ప్రిన్సిపాల్ ఎస్. రామకృష్ణ విద్యార్థులకు సూచించారు.
కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్తి–ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో తిరుమలాయపాలెం పబ్లిక్ హెల్త్ సెంటర్ మండల హెల్త్ సూపర్వైజర్ పి. ప్రేమలత, ఎం ఎల్ హెచ్ పి సంధ్యారాణి, ఏఎన్ఎం ఎస్. సరోజ, ధనమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల విద్యార్థులు ఆరోగ్యం, చదువు, ప్రతిభతో పాటు తమ బంగారు భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల ప్రభావానికి సంబంధించిన గణాంకాలను ప్రస్తావిస్తూ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆరోగ్య శాఖ సిబ్బంది మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలతో పాటు ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, పోషకాహారం, వ్యాయామం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో విద్యార్థులతో “నషాముక్తి–వికసిత్ భారత్” ప్రతిజ్ఞ చేయించడంతో పాటు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మానవహారం నిర్వహించారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. నారాయణ రావు మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, NSS వాలంటీర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
“మత్తుకు దూరం – ఆరోగ్యానికి దగ్గరం…
నషాముక్త యువతే – వికసిత్ భారత్కు బలమైన పునాది” అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.
