కెవిపిఎస్ ఆధ్వర్యంలో జాషువా 131వ జయంతి వేడుకలు.
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
సామాజిక విప్లవకారుడు,నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్)జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య అన్నారు.సోమవారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జాషువా స్ఫూర్తితో కుల వివక్షకు వ్యతిరేకంగా,సామాజిక సమానత్వం కోసం సాంస్కృతిక,సామాజిక పోరాటాలను విస్తృతం చేయాలని జిన్నా లచ్చయ్య పిలుపునిచ్చారు.కుల వివక్ష,సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జాషువా తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు.సామాజిక అణచివేత,ఆర్థిక దోపిడీతో కూడిన కుల వివక్షను తన కలం ద్వారా జాషువా తీవ్రంగా ప్రశ్నించారని తెలిపారు.కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.నేటి సమాజంలోనూ వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.జాషువా ఆశయాలను,సామాజిక సమానత్వం,మానవతా విలువలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొండ వెంకన్న,గ్రామ అధ్యక్షులు జనక సైదులు,కెవిపిఎస్ నాయకులు జిన్నా రాము,జినక ఉదయ్,ఉపేందర్,యాకన్న,వెంకన్న తదితరులు పాల్గొన్నారు..
