గుడుంబా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు
15 మంది నుంచి ముడి పదార్థాలు, గుడుంబా స్వాధీనం
నర్సింహులపేట,సెప్టెంబర్ 29 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అక్రమ నిషేధిత గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు సీఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా తయారీ స్థావరాలపై ఆకస్మిక తనిఖీలు, మెరుపు దాడులు నిర్వహించారు.కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా గోపతండా గ్రామపంచాయతీ పరిధితో పాటు చింతలతండా, అమిరియా తండా, కొత్తతండాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గుడుంబా తయారీకి వినియోగించే ముడి పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు సుమారు 2,000 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేయడంతో పాటు, 3 క్వింటాళ్ల నల్లబెల్లం, 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది వ్యక్తుల వద్ద నుంచి ఈ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అక్రమంగా గుడుంబా తయారు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో తొర్రూరు ఎస్సై ఖాదర్ పాషా, నర్సింహులపేట ఎస్సై వెంకన్న, దంతాలపల్లి ఎస్సై రవి,పెద్దవంగర ఎస్సై ప్రమోద్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

