కురవి, సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్):
యూపీఐ చెల్లింపులపై చార్జీలు విధించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కురవి మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో తురక రమేష్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.నగదు రహిత ఆర్థిక వ్యవస్థ పేరుతో ప్రజలను యూపీఐ చెల్లింపులకు అలవాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడే విధానాలను అవలంబించకూడదని అన్నారు. యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం చార్జీలు వసూలు చేసే ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యాపారులపై విధించే యూపీఐ, ఎండీఆర్ చార్జీల భారం చివరకు వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపైనా చార్జీలు విధించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి సామాన్య ప్రజలపై భారం మోపే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని కోరారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరావు, బుడమ వెంకన్న, కన్నె వెంకన్న, దూదికట్ల సారయ్య, బొల్లం ఉప్పలయ్య, బస్వ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
