పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం చెల్లించాలి
మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌పై 98 జీవోను రద్దు చేయాలి
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని CPI, CPM ఆధ్వర్యంలో ధర్నాలు
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ | సెంటర్: బయ్యారం
బయ్యారం, సెప్టెంబర్ 21 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా ధర్నాలు నిర్వహించారు. మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు సంబంధించిన 98 జీవోను రద్దు చేయాలని, ఏజెన్సీ రైతాంగానికి నష్టం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేయగా.. ఎల్‌నినో వాతావరణ ప్రభావంతో పంటలు నష్టపోయిన నేపథ్యంలో గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.సీపీఎం రాష్ట్ర నేత కట్టబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంటలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కొద్దో గొప్పో సాగు చేసిన పంటలకు తగిన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌పై జారీ చేసిన 98 జీవోను రద్దు చేసి ఏజెన్సీ రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రజావాణి అధికారి, ఎంపీడీవో మంగమ్మకు అందజేసినట్లు తెలిపారు.సీపీఎం జిల్లా కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి మాట్లాడుతూ.. వాతావరణ ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.కరువుతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని, పశువులకు మేత, తాగునీటి కొరత లేకుండా ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించాలని, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

